Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

శిరోవేదనకు చికిత్స శిరశ్ఛేదమా ?

ఈ కాలంలో అందఱు జాతివిషయంగా తీవ్రచర్చ చేస్తున్నపుడు, ఈ విషయంగా నేనూ మాట్లాడుదా మనుకొన్నాను. ఈ విషయంగా కూలంకషంగా యోచిస్తే వర్ణవ్యవస్థ ఉండటమే మేలు అనిపిస్తుంది. ప్రజానీకంలో ప్రగతికిగాని, ఆత్మలాభానికిగానీ ఈవ్యవస్థసహాయకారియే అని కనిపిస్తుంది.

నేను ఇట్లా చెప్పుతున్నానని మీరు ఒప్పుకోవలసిన పనిలేదు. శాస్త్రములు చెప్పినాయని ఒప్పుకో నక్కరలేదు. ఈ మఠములూ మఠాచార్యులూ ప్రగతికి విరోధులనీ, సంకు చిత స్వభావులనీ పూర్వాచార పరాయణులనీ లెక్కకట్టినా మన దేశము పురోగమించవలె నన్న ఆశయము మనకందరికీ ఉన్నదన్న విషయంలో సందేహముండదు కదా!

దేశములో పాతుకొనిపోయిన మూఢనమ్మకములను నిర్మూలించి వెనకబడిన జాతులను ముందరకు తీసుకొనిరావలెనని ప్రయత్నించిన నాయకు లెందరో ఉన్నారు. ఇటువంటి వారిలో మహాత్మాగాంధీ ఒకరు. వారు వర్ణాశ్రమ ధర్మమును మనః పూర్వకముగా ఒప్పుకొన్నందున వారి అభిప్రాయం చెప్పుతున్నాను. ''వర్ణాశ్రమ ధర్మము స్వాభావికమైనది. జన్మచే సంభవించినది. హిందుమతము దీనిని ఒక ా-|n-| గా చక్క బెట్టినది. ఈ వ్యవస్థ వృత్తి ననుసరించి వారి వారి విధులను తెలుపుతున్న దేకాని భేదమును సూచించుటలేదు. ఇతరులను హీనముగా చూచుటకాని, తన్ను ఉత్కృష్టముగా తలచుకోవడముగాని హిందూమత సిద్ధాంతమునకే విరోధ మైనది. ప్రతిఒక్కరూ, సంఘ నియమములకు లోబడి తమ్ము తాము సంయమనము చేసుకొని సమూహశక్తిని వృథా చేయక పొదుపు చేసుకొనుటకే వర్ణాశ్రమ ధర్మ మేర్పడినది. నేను తరచు వర్ణాశ్రమ ధర్మమునకు అప్పృశ్యతకు మధ్యగల భేదమును చూపియున్నాను. వర్ణాశ్రమ ధర్మము శాస్త్ర సమ్మతమైనది. సయుక్తికమైనది. అప్పృశ్యత తెచ్చిపెట్టు కొన్న ఆచారము కనుక అది కూడదని ఖండించి వున్నాను. వృత్తి ననుసరించి జన్మతః సిద్ధించిన వర్ణాశ్రమ పద్ధతి సామూహిక జీవనమునకు సరియైన విభాగము. సమాజములో కార్మికునికీ మననశీలునికీ (ిఠnీ|స) సమానస్థితి, వర్ణాశ్రమము కలిగించి యున్నది' అని వారు వర్ణవ్యవస్థను ప్రశంసించారు.

కాని వారు చేసిన పలుకార్యములు ఆచార అనుష్ఠానములలోని వ్యత్యాసములను పరిగణించునవిగానే వుండినవి. ''వర్ణధర్మము మంచిదే- కాని అది ప్రస్తుతము చాలా జీర్ణించి పోయినది. దానిని ఉద్ధరించుట కానిపని సారమంతాపోయిన పిదప షిష్ఠిని పట్టుకొన్న ఎంతలాభమో, ప్రస్తుతమున్న వర్ణ వ్యవస్థను పాటించటమూ అంతే. బాహిరభేదములను మాత్రం మనం పాటించడం చాలా తప్పు'' అని వారు అభిప్రాయపడ్డారు.

కాని నా అభిప్రాయం అదికాదు. మన మతమునకు వెన్నెముకలాంటి ఒక వ్యవస్థను స్వన్థపఱచుట కాని పని అని వదలి వేసిన ఒక మఠము, మఠాధిపతి అని ఉండవలసిన అవసరములేదు. ఒక సంస్థను నిర్వహిస్తూ నేను ఊరకుంటే సమాజమును పీల్చుకొని తినడమే ఔతుంది. పాతవ్యవస్థ పూర్తిగా అంతరించినదే నిజమైతే- ఈ మఠమునకు స్వస్తి వాచకం పలకవలసినదే. అంతటిస్థితి ఇంకా రాలేదనే నా నమ్మకం. కొద్దిరోజులలో ఈ వర్ణవ్యవస్థ పూర్తిగా అంత రిస్తుందన్న అభిప్రాయమూ నాకులేదు. ఇప్పుడైనా మనం మేల్కొని చేయవలసిన దానికి పూనుకొన్నామంటే, ఈ వ్యవస్థకు పుష్టి మరల తల ఎత్తునట్లు చేయగలమని నా విశ్వాసం.

మిగతా వృత్తులలో ఎట్టి సంకరమున్నా అన్నిటికినీ ప్రాణనాడివలె వున్న వేదాధ్యయనము అక్కడక్కడా ప్రాచీన కాలములో జరిగినట్లే, ఈనాటికీ జరుగుచున్నది. వేదవిద్య ఉద్ధారణకై చేయు ప్రయత్నములు ఫలవంతములుగానేఉంటున్నవి. విద్యార్థులున్నూ అధిక సంఖ్యలోవచ్చి చేరుతున్నారు. దీనిని రక్షించి వృద్ధిచేయడమే నా విధి. వేదాధ్యయన మొకటి రక్షించిన తక్కిన వర్ణసంకరము లెట్లున్ననూ, ఆ దోష నివృత్తి కొక మార్గమును కల్పించిన వార మగుదుము. అట్లు సంరక్షింపక పోయినచో సమాజానికి దుర్గతియే- అని యాభై ఏళ్ళ చరిత్రానుభవమే చాటుతోంది. లేదా వర్ణ ధర్మము లేని ఇతర దేశాలలోని నాగరికుల గతి చూచినను మనకు తెలుస్తుంది.

'చేతి పరిశ్రమలను మనం ఉద్ధరించాలి. దాని వలన హెచ్చుమందికి జీవనోపాధిని కల్పించిన వార మౌతాము. భారీపరిశ్రమల కంటే చేతిపరిశ్రమల వలననే గ్రామ సముద్ధరణమునకు వీలున్నది. యాంత్రికశక్తి మనిషిశక్తిపై ఆధారపడి పొదుపుగా జీవితం గడపటం నేర్చుకోవాలి. డాంబికమైన దుస్తులకు మనం పోరాదు'- అని గాంధీగారు బోధించినా, ప్రస్తుతము ప్రభుత్వము దీనికి విరుద్ధంగానే రాజరికం చేస్తున్నది. కాని గాంధిగారిపై స్తోత్రపాఠములు మాత్రం వదల లేదు. గాంధిగారు వాస్తవముగా సమాజ శ్రేయోభిలాషి. సమత్వమునకు పాటుపడిన సంఘసంస్కర్త. పాతశాస్త్రములను మూఢముగా నమ్మిన మొరడు సనాతని కాదనుటలో అందరికీ నమ్మకమున్నది- అందుచేత మధ్యవర్తి అయిన ఆయన అభిప్రాయములను మీ చెవినివేస్తే మీకు మనస్సులో హత్తుకొంటుందేమో అని ఈ వివరణ.

జాతిని వద్దనటము అది ఉచ్చనీచములకు ఎక్కడ ఎడమిస్తుందో అని. ఒకవేళ జాతిభేదము లున్ననూ, ఒకజాతి గొప్ప, మరొకటి తక్కువ, అన్న భావం వర్ణవ్యవస్థలో లేదు. 'అట్టి అభిప్రాయ మున్నందుననే కలహములు వస్తున్నవి. అందులకే మేము జాతిని నిరసిస్తున్నాము' అని కొందఱు అంటారు. ఇది ఏలాగున్నదంటే, శిరోవేదన వచ్చిన దని శిరచ్ఛేదము చేసుకొనుట వంటిది. తరతరములుగా మనం పాటిస్తున్న ధర్మంలో ఏదైనా లోపంవుంటే, దానిని హితముగా శాంతముగా వివరించి, రుజాశాంతి చేయవలెనేకాని సమూలంగా ధర్మమును పెళ్ళగించటం పరిపాటికాదు. ఒక విషయంలో వివాదంవస్తే, విషయాన్నే నిరాకరించటం బుద్ధిమంతుల లక్షణంకాదు. ఏ విషయంలోనూ కక్షలు, ప్రతి కక్ష లనేవి ఉంటూనే ఉంటవి. అభిప్రాయభేదము లున్నవని ఒక వ్యవస్థను నిర్మూలించుట మంచి పని కాదు.

ప్రస్తుతం రెండు వాదము లున్నవి. ఒకటి భాషా వివాదం. రెండవది సిద్ధాంతవివాదం. అందుకని భాష మనకు వద్దు. ఐడియాలజీ అంతకుముందే వద్దు అని చెప్పగలమా? ప్రస్తుతం మన దేశంలో రగులుతున్న భాషావివాదం లాంటిది మరేదేశంలోనూ చూడలేము. అరవలకూ, ఆంధ్రులకూ వివాదం. కర్ణాటకులకూ మహారాష్ట్రీయులకూకలహం. పోనీ ఉత్తరదేశం వారైనా నెమ్మదిగా వున్నారా అంటే బెంగాలీలకు, బీహారీలకు కయ్యం. హిందికీ, ఇంగ్లీషుకూ వివాదం. ఈ కలహాలు నోటితోనే కాక చేతులదాకా వస్తున్నవి. వివిధభాష లున్నందునకదా! ఈ కలహాలు; ఈ భాషలనే దేశంనుంచి బహిష్కారం చేస్తే శాంతి అని ఎవరైనా అంటే, అది భాషాపరిష్కార మౌతుందా?

రెండవది రాజకీయ వివాదం, రాజరికం ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలి? కమ్యూనిజమా? క్యాపిటలిజమా? ఈ వివాదం ప్రపంచమంతా నిండిన విషయం. దినపత్రికలను చూచామంటే, చిన్న చిన్న దేశాలు ఈ కలహాలకు గురి ఔతున్నవని తెలుస్తున్నది. వీనివలన నోరులేని ప్రజలకుబాధ. డిక్టేటర్‌షిప్‌. డెమోక్రసీ అని రెండు తెగలు; రాజ్యానికి ఒక డిక్టేటరు రాగానే వాని ప్రతిపక్షు లందరూ బలి కావలసినదే. అతడూ తన రాజ్యం డెమోక్రసీ అనియే వ్యవహరిస్తున్నాడు. లోకంతీరు ఈ విధంగావుంది. రాజరికమంటే ఏదో ఒక సిద్ధాంతంపై ఆధారపడి వుండాలి మరి. ఏ సిద్ధాంతమూ వద్దు అని అంటే రాజ్యాంగమే వద్దనా? భాషావివాదం వున్నందువలన భాషవద్దు. రాజకీయ కక్ష లున్నందువలన రాజ్యాంగం వద్దు. మత విభేదా లున్నందువల్ల మతాన్ని నిర్మూలం చేద్దాం- అంటే జరిగేపనియేనా?

'జాతిభేదం ఉండరాదు, జాతిని నిర్మూలించాలి' అని చెప్పేవాళ్ళందరినీ ఎలక్షన్ల సమయంలో చూడాలి. అప్పుడు అన్నిటికీ మించిన ప్రాధాన్యం జాతికి. జాతి వద్దనటం అంతా- వాస్తవానికి ఒక ప్రత్యేకమైన జాతివద్దు అన్నట్లు ఔతుంది. జాతు లున్నందువలన ఒకటి ఎక్కువ మరొక్కటి తక్కువ అనే అభిప్రాయానికివీలుంటుంది. అని నాగరికులు అనుకొన్నా హెచ్చుతక్కువలు నిజంగా సమసిపోవాలంటే మన సనాతన ధర్మం పాటించడమే దానికి మార్గం. సమాజంలో నాకు ఈశ్వరుడు నిర్ణయించిన కర్మ ఇది. దానిని చేతనైనంతవఱకు నిర్వర్తించి సమాజ క్షేమమునకై పాటుపడెదను గాక- అన్న మనోభావమే ఉంటే హెచ్చుతక్కువల ప్రశంశ అసలేరాదు. ఈమనోభావం అందరికీకలగాలనీ ప్రయత్నమూప్రచారమూ చేయాలి. వారి వారి మతం ప్రకారం ఎవరికివారు చక్కగా ఆచరించితే ప్రచారానికి ప్రత్యేకంగాఅవసరముండదు. ప్రత్యక్షంగా అనుష్ఠిస్తే ప్రచార మెందుకు?

ప్రజలు జీవనానికి యిస్తున్న ప్రాధాన్యం సమాజానికి మనం చేయవలసిన కర్త వ్యానికి ఇవ్వటం లేదు. ఈ కాలంలో బ్రతుకులు జీవనప్రధానములై ఏవిధంగా డబ్బును అధికంగా సంపాదించడం అనేదే పెద్ద విచారమై పోయింది మనకు. ఒక జాతి ఎక్కువ సంపాదించి ఆర్థిక సౌకర్యంతో వుంటే దానిని చూచి ఇతరులు అసూయపడటం- జరుగుతున్నది. భేదములు వృద్ధి ఔతున్నవి. ఇట్లుకాక పరస్పర వైషమ్యములు లేకుండా పొదుపుగా జీవనం గడుపుతూ సామాజికక్షేమమే ధ్యేయంగా ఉంచుకొని శాంతి సంతోషములతో ఉండవలెనంటే మనపాత ఆచారాలను, మన ధర్మాలను మనం వదలరాదు. ఈ విషయంలో మనం ఒక అడుగు వేస్తే ఈశ్వరుని అనుగ్రహమూ మన వెంట ఉంటుంది.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page